: ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను... సందు గొందుల్లో ప్రజలు చర్చించండి, సమాధానం కోసం కాంగ్రెస్ ను నిలదీయండి: వెంకయ్య


"నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నపై వీధి వీధుల్లో, సందు గొందుల్లో ప్రజలు చర్చించాలి. సమాధానం కోసం కాంగ్రెస్ ను నిలదీయాలి. నేడు ప్రత్యేక హోదా అంటూ అరచి అల్లరి చేస్తున్న వారు నాడు విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదు? పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నా. ఎవరూ ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అ... అదెందుకు ఇప్పుడు అంటారు? చట్టంలో ఎందుకు చేర్చలేదు? అంటే మాట్లాడకుండా రామచంద్రరావు ప్రెవేటు బిల్లు తెచ్చారు. పాపం నేను చెబుతున్నా కదా... రాష్ట్రం విడిపోకుండా పట్టుదలగా ఉన్నాడని. చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్న పార్టీ సభ్యుడే బిల్లు తెచ్చారు. దీనికి సమాధానం ఏంటయ్యా?" అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అడిగారు. పోలవరం ప్రాజెక్టులో అన్ని అడ్డంకులూ తొలగిస్తామని చెప్పి, సమస్యను జటిలం చేశారని విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని తొలగించే దాకా అడ్డంకులను ఎందుకు తొలగించలేదు? ఈ ప్రశ్నకు కూడా కాంగ్రెస్ వద్ద సమాధానం లేదని చెప్పుకొచ్చారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే క్యాబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ జారీ ద్వారా పోలవరం అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. దీంతో తన గడ్డిబొమ్మలను తగుల బెట్టారని, అప్పుడు వీరంతా ఏం చేస్తున్నారని వెంకయ్య ప్రశ్నించారు. ఒక్కరు కూడా ఖండించలేదని, తెలంగాణలోనేమో అమ్మ వరం అని ప్రకటించుకున్న కాంగ్రెస్, ఆంధ్రాలో బీజేపీ వల్లే ఇదంతా అయిందని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. కొంతమంది అతిగా మాట్లాడుతున్నారని, మరికొందరు తెలిసీ తెలియకుండా విమర్శలు చేస్తున్నందునే తాను నేడు మాట్లాడాల్సి వచ్చిందని, విభజన నేపథ్యాన్ని, నాటి ఘటనలను చెబుతున్నానని వెంకయ్య చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నందునే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అడుగుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూసిన తమ పార్టీ న్యాయం చేయాలని నిర్ణయించుకుందని, అందులో ఎంతమాత్రం అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. 38 మంత్రులను పిలిపించి, చట్టాన్ని చదివి, ఏ మంత్రి కింద ఏముందో చెప్పి, వారందరికీ త్వరితగతిన ఏపీకి న్యాయం చేసేలా చూడాలని కోరామని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News