: సంబరాలా? ఏమనాలో కూడా అర్థం కావడం లేదు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన బీజేపీ ఆ డబ్బులు ఇచ్చేసినట్టు, ఆ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు పూర్తి చేసేసినట్టు సంబరాలు చేసుకుంటామని చెప్పడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలు రెండూ రాష్ట్రానికి వచ్చి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా రాష్ట్రానికి అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెబితే ఎవరు నమ్ముతారని ఆయన అడిగారు. కనీసం వారి పార్టీ కార్యకర్తలైనా వారిని నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఏపీ ప్రజల్లోకి వెళ్లి చూడాలని ఆయన సూచించారు. నలుగురు నేతలు, పార్టీ అనుచరులు ఏది చెబితే అదే వాస్తవం కాదని ఆయన తెలిపారు. ప్రజల్లోకి ఎవరైనా వెళ్లగలిగితే వారికి వాస్తవాలు తెలుస్తాయని, మనస్సాక్షి మీద చెయ్యివేసి వారు నిజాలు మాట్లాడితే అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు. బీజేపీ సంబరాలు చేసుకుంటానంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదని, దానిని చెప్పడానికి భాష కూడా రావడం లేదని ఆయన తెలిపారు. చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ సంబరాలు చేసుకుంటోందని ఆయన అన్నారు.