: మంత్రి పదవి ఇవ్వమని అడిగితే...నువ్వు యంగ్ ఎమ్మెల్యేవి అన్నారు: చంద్రబాబు
అవగాహనా రాహిత్యం కారణంగా 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తాను అప్పట్లో సిద్ధమయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, ఆ తరువాతే తనకు ఎమ్మెల్సీ అయ్యేందుకు ఆ వయసు సరిపోదని తెలిసిందని అన్నారు. 28 ఏళ్ల వయసులో తాను ఎమ్మెల్యే అయ్యానని అన్న ఆయన, నేరుగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వద్దకు వెళ్లి, తనను కేబినెట్ లోకి తీసుకోవాలని కోరానని గుర్తుచేసుకున్నారు. 'నువ్వింకా యంగ్ ఎమ్మెల్యేవి. అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావా?' అన్నారని ఆయన తెలిపారు. ఆ తరువాత అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన కేబినెట్ లో స్థానం కల్పించారని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు.