: హైస్పీడ్ రైలు టాల్గోకు నేడు తుది ట్రయల్ రన్.. ఢిల్లీ నుంచి ముంబైకి పరుగులు పెట్టనున్న రైలు
స్పానిష్ తయారీ హైస్పీడ్ రైలు టాల్గోకు నేడు తుది ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ దూరాన్ని 16 గంటల నుంచి 12 గంటలకు టాల్గో తగ్గించనుంది. తొమ్మిది తేలికపాటి కోచ్‌లు ఉండే ఈ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టగలదు. ఈ రోజు తుది ట్రయల్ రన్ నిమిత్తం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీలో బయలుదేరుతుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 11 గంటల 45 నిమిషాల్లో ముంబై చేరుకుంటుంది. ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు ట్రయల్ రన్లలో మూడింటిలో ఈ రైలు అనుకున్న వేగాన్ని అందుకోలేకపోయింది. బుధవారం నిర్వహించిన రన్‌లో ముంబైకి 18 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. ఢిల్లీ-ముంబై మధ్య ఉన్న 1400 కిలోమీటర్ల దూరాన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ 16 గంటల్లో చేరుకుంటుండగా టాల్గో ఈ దూరాన్ని 12 గంటల్లోనే చేరుకోనుంది. తొమ్మిది కోచ్‌లు ఉండే టాల్గోలో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు, నాలుగు చైర్ కార్లు, కెఫెటేరియా, పవర్ కార్, టెయిల్ ఎండ్ కోచ్‌లు ఉంటాయి.