: వైసీపీ సభ్యులపై చర్యలకు రంగం సిద్ధం!... తక్షణావసరమన్న అచ్చెన్న!
మూడు రోజుల ఏపీ శాసనసభను ఒకేఒక్క డిమాండ్ తో స్తంభింపజేసిన వైసీపీ సభ్యులపై చర్యలకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఈ మేరకు నేటి ఉదయం సభ ప్రారంభం కాగా... వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ప్రసంగించిన కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సభను అడ్డుకుంటూ సభా మర్యాదలను గంగలో కలిపిన వైసీపీ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కోరారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలను కాపాడాలంటే వైసీపీ సభ్యులపై చర్యలే శరణ్యమని ఆయన చెప్పుకొచ్చారు. అచ్చెన్న డిమాండ్ కు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు పలికారు.