: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు రూ.50 లక్షలిచ్చిన జకీర్!... తిరిగిచ్చామన్న కాంగ్రెస్ వాదనను కొట్టేసిన ఐఆర్ఎఫ్!


వివాదాస్పద ఇస్లామిక్ మత గురువు, యువతకు ఉగ్రవాద పాఠాలు బోధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగుచూసింది. ముంబై కేంద్రంగా ‘ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన అతడితో పలు రాజకీయ పార్టీలు అంటకాగాయి. ఈ కారణంగానే ‘పీస్ టీవీ’ ద్వారా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నప్పటికీ అతడిపై ఈగ కూడా వాలలేదన్న వాదన వినిపిస్తోంది. ఇలా జకీర్ తో అంటకాగిన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో జకీర్ కు సంబంధాలున్నాయన్న వార్తలు పెను కలకలమే రేపాయి. తాజాగా జకీర్ నాయక్ సంస్థ ఐఆర్ఎఫ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ఏకంగా రూ.50 లక్షల విరాళం అందింది. 2011లో అందిన ఈ విరాళాన్ని కాంగ్రెస్ కూడా ధ్రువీకరించింది. అయితే, అందిన విరాళాన్ని కొన్ని నెలల తర్వాత తిరిగి ఐఆర్ఎఫ్ కు తిప్పిపంపామని కాంగ్రెస్ చెప్పింది. అయితే కాంగ్రెస్ వాదనను ఐఆర్ఎఫ్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ కు ఇచ్చిన విరాళం తమకు తిరిగి వచ్చిన దాఖలా లేదని ఐఆర్ఎఫ్ ప్రతినిధి వెల్లడించారు.

  • Loading...

More Telugu News