: విమర్శలతో వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్.. ‘నాపలమ్ నగ్న బాలిక’ ఫొటో షేరింగ్‌కు ఓకే
విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. 1972లో వియత్నాంలో జరిగిన రసాయనిక దాడి(నాపలమ్ ఎటాక్) నుంచి తప్పించుకునేందుకు ఏడుస్తూ నగ్నంగా రోడ్డుపై పరిగెడుతున్న చిన్నారి ఫొటోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పులిట్జర్ బహుమతి గెలుచుకున్న ఈ ఫొటోను నార్వేకు చెందిన అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ నిక్ యుట్ తీశారు. దీనిని ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే నియమ నిబంధనలకు ఈ ఫొటో విరుద్ధంగా ఉందంటూ ఫేస్‌బుక్ దీనిని తొలగించింది. శుక్రవారం నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్ ఈ ఫొటోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా దానిని కూడా ఫేస్‌బుక్ తొలగించింది. దీంతో ఫేస్‌బుక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చరిత్రను కళ్లకు కట్టిన ఈ ఫొటోను ఫేస్‌బుక్ తొలగించడంపై పలువురు మండిపడ్డారు. దీంతో ఫేస్‌బుక్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్టు పేర్కొంది. చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది. ఫొటోను తొలగించిన చోటే తిరిగి దానిని పోస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ప్రధాని సోల్‌బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు.