: దేశ చరిత్రలో అతిపెద్ద అణు పరీక్షలు జరిపించిన కిమ్ జాంగ్... 5.3 తీవ్రతతో భూకంపం!


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్, దేశ చరిత్రలోనే అతిపెద్ద అణు పరీక్షలు నిర్వహించగా, దాని తీవ్రతకు రిక్టర్ స్టేలుపై 5.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. అమెరికా, యూరప్ తదితర దేశాల్లోని భూకంప కేంద్రాలు సైతం దీన్ని గుర్తించాయి. ఇది కచ్చితంగా అణు పరీక్షల కారణంగా వచ్చిన భూకంపమేనని దక్షిణ కొరియా అధికారి ఒకరు ఆరోపించారు. నార్త్ కొరియా దుందుడుకు చర్యలతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని అటు జపాన్ సైతం ఆరోపించింది. "ఉత్తర కొరియా తూర్పు ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి చేసిన న్యూక్లియర్ వార్ హెడ్ లను మా అణు శాస్త్రవేత్తలు పరీక్షించారు" అని ఉత్తర కొరియా టీవీ చానల్ ప్రకటించింది. వార్ హెడ్ పేలుడు పరీక్షను విజయవంతం చేసినందుకు సైంటిస్టులను అభినందిస్తూ అధ్యక్షుడి నుంచి మెసేజ్ వెళ్లినట్టు టీవీ అనౌన్సర్ వెల్లడించింది. అణు పరీక్షలు జరిగినట్టు నిర్థారణ జరిగితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ విషయం ప్రస్తావించి, నిరసన తెలుపుతామని జపాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఉత్తర కొరియాపై అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కొరియాలోని పెంగ్ యీ-రి న్యూక్లియర్ టెస్ట్ సైట్ కేంద్రంగా ఈ కృత్రిమ భూకంపం సంభవించిందని సౌత్ కొరియా పేర్కొంది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకూ శబ్దాలు వినిపించాయని, పరీక్షలు విజయవంతం అయ్యాయా? లేదా? అన్నది ఇంకా పరిశీలించలేదని తెలిపింది. కాగా, తమ అణు పరీక్షలపై ఉత్తర కొరియా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువరించ లేదు.

  • Loading...

More Telugu News