: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై కర్ణాటక బంద్.. సెలవు ప్రకటించిన 400 బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థలు
తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై కర్ణాటక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. నిరసన కార్యక్రమంలో తాజాగా ఈరోజు స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా చేరాయి. బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని 10 మిలియన్ల మందికి కావేరీ జలాలే ఆధారం. దీంతో నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని భావించిన ప్రముఖ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో తదితర 400 బహుళజాతి సంస్థలు ఈ రోజు హాలిడే ప్రకటించాయి. అలాగే పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నా హాజరుశాతం మాత్రం పలుచగా ఉంది. ఎయిర్ పోర్టు ట్యాక్సీలు, ఆటోలు నడవడం లేదు. బెంగళూరు మెట్రో సర్వీసులు కూడా మధ్యాహ్నం వరకు రద్దుకానున్నాయి. ఆస్పత్రులు తెరిచే ఉన్నా మెడికల్ షాపులు తెరుచుకోలేదు. పాల సరఫరాకు మాత్రం ఆటంకం కలగలేదు. బ్యాంకులు, రెస్టారెంట్లు కూడా తెరుచునే అవకాశం లేనట్టు తెలుస్తోంది. వచ్చే పదిరోజుల్లో 15,000 క్యూసెక్కుల కావేరీ జలలాను తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సోమవారం నుంచి ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి. తాగు, సాగుకు సరిపడా నీరు లేదని కర్ణాటక వాదిస్తోంది. కావేరీ నదిపై ఉన్న నాలుగు జలాశయాల్లో సాధారణం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గురువారం తమిళనాడుకు నీటిని విడుదల చేయడంతో రైతులకు డ్యాముల నుంచి చుక్క నీరు కూడా అందలేదు. రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసనలపై స్పందించిన ప్రభుత్వం సంయమనం పాటించాలని కోరింది. మరోవైపు బీజేపీ ఈ నిరసనలకు మద్దతు ప్రకటించింది. కావేరీ అంశంపై మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ప్రధానితో చర్చించనున్నారు.