: ఏపీ అసెంబ్లీ గ్యాలరీలో సాయిరెడ్డి!... స్పీకర్ ముందే కాలుమీద కాలేసుకుని కూర్చున్న వైసీపీ ఎంపీ!
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. లాబీల్లోకి ఎంటరైన ఆయన నేరుగా సందర్శకుల గ్యాలరీలోకి వెళ్లి స్పీకర్ ఎదురుగా కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పీకర్ ఎదురుగానే కాలు మీద కాలేసుకుని కూర్చున్నారని, అంతేకాకుండా గ్యాలరీలో నుంచి ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు సైగలు చేస్తూ పేపర్లు చించి స్పీకర్ స్థానంపై విసరాలని సూచించారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సాయిరెడ్డి వ్యవహారాన్నంతా సునిశితంగా గమనించిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సందర్శకుల గ్యాలరీలో పాటించాల్సిన నియమ నిబంధనలను సాయిరెడ్డి అతిక్రమించారని ఆరోపించారు. సాయిరెడ్డి తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని కూడా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. వీరు ఫిర్యాదు చేస్తే, వారు ఆరోపిస్తున్నట్లు సాయిరెడ్డి గ్యాలరీలో నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే ఆయనపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.