: ‘హోదా’ ఇవ్వ‌కూడ‌ద‌నే అంశాన్ని 14వ ఆర్థిక సంఘం చెప్ప‌క‌నే చెప్పింది!: మీడియా సమావేశంలో వెంక‌య్యనాయుడు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి అన్యాయం జ‌ర‌గ‌డానికి బాధ్యులు కాంగ్రెస్ నేత‌లేన‌ని కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ఆర్థిక సాయం అంశంపై ఈరోజు ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ... అట‌వీ, కొండ ప్రాంతం, వెన‌క‌బాటు ఆధారంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని 14వ ఆర్థిక సంఘం సూచించింద‌ని అన్నారు. హోదా కోసం తాను కూడా నిన్న‌టి వ‌ర‌కు ప‌ట్టుబట్టాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే, 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల‌ను ఆమోదించిన దృష్ట్యా రాష్ట్రాల మ‌ధ్య వివ‌క్ష చూపించే అవ‌కాశం లేదని అన్నారు. కొండ ప్రాంతాలు, సరిహ‌ద్దు ప్రాంతాలు వంటి వాటిని మిన‌హాయిస్తే ప‌శ్చిమ‌ బెంగాల్, ఒడిసా, ఏపీ ప్రాంతాల‌కు రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌త్యేకంగా ఏ రాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని ఆర్థిక సంఘం చెప్ప‌క‌నే చెప్పింద‌ని వెంక‌య్య అన్నారు. కేంద్రప్ర‌భుత్వానికి వ‌చ్చే నిధుల్లో 42 శాతం రాష్ట్రాల‌కు, 5 శాతం మున్సిపాలిటీల‌కు, 0.5 శాతం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు పంపాలంటూ ప‌లు అంశాల‌ను సూచించిన ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను ఆనాడే పార్ల‌మెంట్ ఆమోదించిందని వెంక‌య్య వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఉన్న లోటును చ‌ర్చించిన త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని, ప్ర‌త్యేకంగా సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని వెంకయ్య అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలని ఆయ‌న సూచించారు. పోల‌వ‌రం అంశం పట్ల గ‌త ప్రభుత్వం నిర్ల‌క్ష్యం వ‌హించిందని, ఆ ప్రాజెక్టుపై ఎన్డీఏ ప్ర‌భుత్వం ఎంతో దృష్టి పెట్టిందని అన్నారు. దాన్ని పూర్తి చేయ‌డానికి కృషిచేస్తోందని వివ‌రించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయబోదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News