: నాకు నకిలీ పాస్ పోర్టు ఇప్పించింది ఇంటెలిజెన్స్ అధికారులే!: కోర్టు విచారణలో చోటా రాజన్ సంచలన వ్యాఖ్య
తనకు మోహన్ కుమార్ పేరిట తప్పుడు పాస్ పోర్టును ఇప్పించింది భారత ఇంటెలిజెన్స్ వర్గాల అధికారులేనని మాఫియా డాన్ చోటా రాజన్ కోర్టుకు తెలిపాడు. తీహార్ జైల్లో ఉన్న రాజన్ ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించగా, సంచలన విషయాలను వివరించాడు. తాను ఇండియాపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితోను, ఉగ్రవాదులతోను పోరాడుతున్న వ్యక్తినని, అందుకే తనకు నకిలీ పాస్ పోర్టును ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పించారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి వారి పేర్లను మాత్రం చెప్పలేనని అన్నాడు. 1993 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ వారి వివరాలను పోలీసులకు తాను చెబుతుండటంతోనే, దాసూద్ తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, ఆ క్రమంలోనే తన అసలు పాస్ పార్టును తీసేసుకున్నారని ఆరోపించాడు. ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న తాను రహస్యంగా ఉంటూ వచ్చానని చెప్పాడు. కాగా, దాదాపు 25 సంవత్సరాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన రాజన్ గత సంవత్సరం ఇండోనేషియాలో అరెస్టయిన సంగతి తెలిసిందే.