: ఫేస్ బుక్ ఫ్రెండని నమ్మి వెళితే..!
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో స్నేహితుడయ్యాడని నమ్మి అతనింటికి వెళ్లిన పాపానికి 16 ఏళ్ల బాలిక దారుణంగా మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు ఆరు నెలల క్రితం డానియెల్ (24) అనే యువకుడికి బాధితురాలు ఫేస్ బుక్ లో పరిచయం అయింది. వీరిద్దరి మధ్యా చాటింగ్ జరుగుతూ ఉండేది. గత సోమవారం నాడు ఇద్దరికీ కామన్ అయిన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి బాధితురాలు వెళ్లింది. అక్కడికి వచ్చిన డానియెల్ ఆమెతో మాటలు పంచుకుని, తన ఇంట్లో చిన్న పార్టీ ఉందని నమ్మించాడు. ఆ మాటలను నమ్మిన బాధితురాలు డానియెల్ ఇంటికి వెళ్లాలని బయలుదేరింది. మరో స్నేహితుడు తన బైక్ పై తీసుకెళ్లి ఆమెను డానియెల్ ఇంటి వద్ద దింపాడు. అక్కడ ఎవరూ లేకపోగా, అనుమానంతోనే ఇంట్లోకి వెళ్లిన ఆమెకు మత్తు మందిచ్చిన శీతల పానీయాన్ని ఆఫర్ చేసిన డానియెల్, ఆపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె తెలుసుకుంది. ఘటనను వీడియో తీశానని, ఎవరికైనా చెబితే దాన్ని ఆన్ లైన్లో పెడతానని బెదిరించాడు. ఆపై బాధితురాలిని ఇంట్లో దింపాడు. బాధితురాలు భయపడకుండా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డానియెల్ ను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు పంపారు.