: విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తాం: కేంద్రం నోట పాత పాటే... నిరాశ పరచిన జైట్లీ ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రత్యేక హోదా బదులు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ను ఈ రోజు ప్రకటిస్తుందంటూ పొద్దుటి నుంచీ ఎదురుచూసిన ప్రజలను కొన్ని క్షణాల క్రితం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. ప్రత్యేక ప్యాకేజ్ పై నిర్థిష్టమైన ప్రకటన ఏమీ చేయకుండానే, విభజన చట్టంలోని హామీలన్నిటినీ నెరవేరుస్తామంటూ ఇన్నాళ్లూ పాడిన పాటే పాడారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులో కూరుకుపోయిన మాట వాస్తవమని, ఆ విషయంలో కేంద్రం సాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే గతేడాదికి గాను 3975.05కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగిందని అన్నారు. మిగతాది దశల వారీగా చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని నీతిఆయోగ్ చూసుకుంటుందని అన్నారు. అలాగే రాష్ట్రానికి రైల్వే జోన్ అంశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటన చేస్తారని జైట్లీ చెప్పారు. పోలవరం ప్రాజక్టు ఖర్చు భరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం వ్యవహారాలు చూసుకుంటుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను బట్టి రాష్ట్రానికి న్యాయం చేస్తామన్నారు. 42 శాతం నిధులు ఇస్తామని, రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుందని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం సాయం చేస్తూనే ఉంటుందని మరో మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకోవడంలో న్యాయం ఉందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం తప్పక నెరవేరుస్తుందని చెప్పి, మీడియా సమావేశాన్ని ముగించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిన వీరి మీడియా సమావేశం పట్ల వివిధ రాజకీయ పక్షాల నేతలు భగ్గుమంటున్నారు.