: విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటు కుదరదు... కేంద్రానికి తేల్చిచెప్పిన ఏపీ సర్కారు!
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించేందుకు దాదాపు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం అందులో ఓ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ కోరుతున్నట్లుగా విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ పై ఒడిశా, ఛత్తీస్ గడ్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని చెప్పిన కేంద్రం... విజయవాడలో ఏర్పాటుకు ఏపీ అంగీకరిస్తే ఇప్పటికిప్పుడే రైల్వే జోన్ ను ప్రకటిస్తామన్న ఓ వాదనను నిన్న రాత్రి తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి దీనిపై కాస్తంత సమాచారం అందుకున్న ఏపీ సర్కారు వేగంగా స్పందించింది. ప్రత్యేక రైల్వే జోన్ విశాఖలోనే ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పిన చంద్రబాబు సర్కారు... విజయవాడలో రైల్వే జోన్ కు అంగీకరించేది లేదని తెలిపింది.