: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులకు రూ.147 కోట్లు విడుదల: మంత్రి నారాయణ
సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం ఈరోజు ఉదయం విజయవాడ చేరుకుంది. రాష్ట్రానికి చేరుకున్న వెంటనే నవ్యరాజధాని అమరావతిలో నిర్వహిస్తోన్న ఏపీ సచివాలయ పనులను నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెలగపూడిలో రూపుదిద్దుకుంటున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి తాము ఇప్పటివరకు రూ.147 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చేనెల 14 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు అమరావతిలో రైతులకు ప్లాట్ల కేటాయింపులు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవ్యరాజధానిలో ఎలక్ట్రికల్ బస్సులు, రైళ్ల ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నారాయణ తెలిపారు. తాము సింగపూర్ పర్యటనలో భాగంగా అమరావతిలో రోడ్ల నిర్మాణంపై అక్కడి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను నియమించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.