: ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ సెక్స్ సీడీల కేసులో పోలీసులు విఫలం... నేడు బెయిల్ ఖాయం!
తన వద్దకు వచ్చిన యువతితో సన్నిహితంగా గడిపి, ఆపై పదవిని కోల్పోయిన ఆప్ మంత్రి సందీప్ కుమార్ పై బలమైన సాక్ష్యాలను సిద్ధం చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలం కావడంతో ఆయనకు నేడు బెయిల్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ అశ్లీల వీడియోలను చిత్రీకరించిన వారెవరన్న విషయాన్ని వెలికితీయడంలో విఫలం కావడంతో పాటు, ఆ వీడియోలను నలుగురికీ పంచింది ఎవరన్న విషయాన్నీ తేల్చలేకపోయిన పోలీసులు, తదుపరి విచారణను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్న విషయమై తలలు పట్టుకుంటున్నారు. వీడియోలోని యువతి తనపై సందీప్ కుమార్ అత్యాచారం చేసినట్టు పెట్టిన కేసు కూడా చెల్లబోదని, ఈ వీడియోలో యువతి తానంతట తాను దగ్గరకు వచ్చినట్టుగా ఉండటమే ఇందుకు కారణమని, ఆ సమయంలో ఆమె తెలివిలో లేదని చెప్పేందుకు కూడా వీలు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక ఈ ఘటన ఎప్పుడు ఏ సమయంలో జరిగిందన్న విషయాన్ని బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోవడం కూడా కేసును నీరుగార్చిందని తెలుస్తోంది. కేసు చాలా బలహీనంగా ఉండటంతో నేర నిరూపణకు అవకాశాలు లేవని, సందీప్ కు నేడు బెయిల్ రావచ్చని అంచనా.