: అందరి చూపు నార్త్ బ్లాక్ వైపే!... మధ్యాహ్నం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజల చూపంతా ఢిల్లీలోని నార్త్ బ్లాక్ వైపే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ఉన్న సదరు నార్త్ బ్లాక్ నుంచే నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ఓ కీలక ప్రకటన వెలువడుతుందన్న కథనాలు అన్ని మీడియా సంస్థల్లోనూ విరివిగా ప్రసారమవుతున్నాయి. ఏపీకి భారీ నిధులతో కూడిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... మరో సహచర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయం నుంచి కీలక ప్రకటన చేయనున్నారని సదరు కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఏ మేర కేంద్ర సాయం లభిస్తుందని ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఏపీకి ఇచ్చే ప్రతి అంశాన్ని తమకూ వర్తింపజేయాలని తెలంగాణ వాదిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రకటన పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. వెరసి నేడు అందరి దృష్టి నార్త్ బ్లాక్ పైనే ఉండనుంది.