: రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ ఉత్తదేనా?.. రూ.50కి 1జీబీ డేటా ప్లాన్ లేనే లేదట!
రిలయన్స్ జియో.. ఈ మధ్యకాలంలో ఇంత పాప్యులర్ అయిన పేరు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఏ ప్రాంతమైనా, ఏ నోట విన్నా అందరూ ఇదే పేరు జపించారు. సిమ్‌ను దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. నిద్రాహారాలు మాని క్యూలో నిల్చున్నారు. దీనికి కారణం మూడు నెలలపాటు వాడుకున్న వారికి వాడుకున్నన్ని కాల్స్, డేటా ఫ్రీ కావడం. దీనికి తోడు రూ.50కే 1జీబీ డేటా అని సంస్థ ప్రకటించడం. సంచలనానికి కారణమైన ఈ ఆఫర్‌ను పరికించి చూస్తే.. జియోలో అసలు అటువంటి ఆఫరే లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే చర్చంతా. మరి రిలయన్స్ ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవాలంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలా ప్రకటనల్లో కనిపించే ‘షరతులు వర్తిస్తాయి’ నిబంధన రిలయన్స్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. డిసెంబరు 31వ తేదీ వరకు అన్నీ ఫ్రీ.. ఫ్రీ.. అని ప్రకటించిన రిలయన్స్.. జనవరి 1వ తేదీ నుంచి మాత్రం రూ.50కే 1జీబీ ఇస్తామంటూ సంచలనానికి తెరలేపింది. నిజానికి రిలయన్స్ వెబ్‌సైట్‌లో ఆ ప్లాన్ అన్నదే లేకపోవడం చిత్రం. కళ్లు కాయలు కాచేలా వెతికినా అది కనబడదు. సంస్థ వెబ్‌సైట్ ప్రకారం.. రూ.19తో టారిఫ్‌లు మొదలవుతుండగా దాని కాలపరిమితి ఒక్క రోజే. రాత్రిపూట అన్‌లిమిటెడ్ 4జీ డేటా ఉచితమని సంస్థ ప్రకటించింది. అయితే రాత్రి అంటే ఇక్కడ 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అని అర్థం. జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితమే కానీ 2017 జనవరి నుంచి మాత్రం కాదు. ఒకవేళ రూ.499 పెట్టి 4జీ డేటా తీసుకుంటే అది అయిపోయాక ఏమవుతుందో తెలుసా? సంస్థ ప్రకటించినట్టు రూ.50కే 1జీబీ రాదు. 10 కేబీ చార్జింగ్ పల్స్ చొప్పున 1జీబీకి రూ.250 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంచుమించు ఇంతే ధరతో ఇతర నెట్‌వర్క్ కంపెనీలు కూడా 1జీబీ డేటాను అందిస్తుండడం గమనార్హం. అదే పోస్టుపెయిడ్‌లో అయితే డేటా ఉచితంగా వస్తుంది కానీ స్పీడే.. 128 కేబీపీఎస్‌కు పడిపోయి నత్తనడకను తలపిస్తుంది. మరి ఫ్రీకాల్స్ సంగతేంటి? ఇక్కడ కూడా చిన్న మర్మం ఉంది. ఫోన్‌లోని డయలర్ ద్వారా చేసే కాల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్కైప్ ద్వారా చేసే కాల్స్‌కు మాత్రం డేటా చార్జీలు వర్తిస్తాయి. సో.. డేటా కరిగిపోయి చేతి చమురు వదిలిపోతుంది. అయితే కాల్స్ చేసే సమయంలో మొబైల్ డేటా ఆన్ చేయాల్సిన పనిలేకపోవడం చిన్న ఊరట. సో.. ఏ రకంగా చూసినా వినియోగదారుల జేబు గుల్లకావడం ఖాయమన్నమాట!