: భూమనకు 6 గంటల పాటు ప్రశ్నల వర్షం!... నేడు కూడా సీఐడీ విచారణకు వైసీపీ నేత!
తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ ఏడాది జనవరిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసం కేసులో వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐడీ అధికారుల నోటీసులతో ఆయన నిన్న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయమే తమ కార్యాలయానికి వచ్చిన భూమనను సీఐడీ అధికారులు సాయంత్రం దాకా విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు భూమనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యాహ్నం సమయంలో లోపలికే భోజనం తెప్పించిన సీఐడీ పోలీసులు భూమనను మాత్రం బయటకు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో భూమనను అరెస్ట్ చేస్తారన్న వదంతులు వినిపించాయి. దీంతో సీఐడీ కార్యాలయం వద్ద కాస్తంత హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు సాయంత్రం వేళ భూమన సీఐడీ కార్యాలయం బయటకు రావడంతో అరెస్ట్ వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే నేడు కూడా విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరినట్లు భూమన చెప్పడంతో వైసీపీ వర్గాల్లో మరింత మేర ఆందోళన వ్యక్తమైంది. నిన్నటి మాదిరే నేడు కూడా ఉదయమే భూమన సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.