: సీనియర్ మంత్రులు ఒక్క పైసా ఖర్చు చేయని వేళ... కార్యాలయాల షోకులకు జూనియర్లు రూ. 3.5 కోట్లు వాడేశారట!
నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు తమ తమ కార్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వేళ, వారి సహాయ మంత్రులు మాత్రం భారీగానే ఖర్చు పెట్టి తమ ఆఫీసులకు కొత్త హంగులను సమకూర్చుకున్నారు. ఓ ఆర్టీఐ కార్యకర్త రాబట్టిన వివరాల మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు ఆఫీసుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇక మోదీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు 23 మంత్రుల కార్యాలయాల్లో వసతుల కల్పనకు రూ. 3.5 కోట్లను ఖర్చు చేశారు. వీరిలో స్మృతీ ఇరానీ అత్యధికంగా రూ. 70 లక్షలను, జూనియర్ మంత్రుల ఆఫీసుల కోసం మరో రూ. 40 లక్షలను వెచ్చించారని తెలుస్తోంది. నజ్మా హెప్తుల్లా ఖర్చు చేయనప్పటికీ, ఆమె నిర్వహిస్తున్న మైనారిటీ శాఖకు సహాయమంత్రిగా ఉన్న ఎంఏ నఖ్వీ రూ. 14 లక్షలతో ఆఫీసును తీర్చిదిద్దుకున్నారు. ఇక తాము కాలుమోపిన వేళ, చెత్తగా ఉన్న ఆఫీసులను సరిగ్గా చేసుకున్నామని వీరంతా చెబుతుండటం గమనార్హం. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారిలో వీరేందర్ సింగ్, రాజ్యవర్థన్ రాథోడ్, ఉపేంద్ర కుష్వాహ, ఆర్ఎస్ కథేరియా, జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.