: ఇక ‘గిగా ఫైబర్’!... హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలకు రిలయన్స్ జియో సన్నాహాలు!
మొబైల్ సేవల రంగంలో పెను సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో... తాజాగా ఇంటర్నెట్ సేవల రంగంలోనూ అలజడి రేపింది. ఏకంగా 1 జీబీపీఎస్ (100 ఎంబీపీఎస్) స్పీడుతో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ముంబై, పుణే నగరాల్లో ఈ సేవలకు సంబంధించిన ట్రయల్స్ సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో 1 జీబీపీఎస్ స్పీడు కంటే కాస్తంత తక్కువ స్పీడుతో ఆ సంస్థ ఇంటర్నెట్ సేవలను అందించే సత్తాను సాధించింది. ఇక పుణేలో మాత్రం 1 జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సేవలు సాధ్యమేనని ఆ సంస్థ జరిపిన ట్రయల్స్ లో తేలిపోయింది. ఈ రెండు నగరాల్లో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సానుకూల ఫలితాలు రావడంతో ఇక దేశంలోని మరిన్ని నగరాల్లో ‘గిగా ఫైబర్’ పేరిట నామకరణం చేసిన ఈ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే... ఇంటర్నెట్ సేవల రంగంలోని పలు కంపెనీలకు గడ్డుకాలమే రానుందన్న భావన వ్యక్తమవుతోంది.