: సిగ్గు చేటు!.. దేశ రాజధానిలోని సర్కారీ స్కూళ్లలో 74 శాతం మంది విద్యార్థులకు చదవడమే రాదట!
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో 74 శాతం మందికి చదవడమే రాదట. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయినట్టు ఆయన పేర్కొన్నారు. చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల విషయంలో కొత్త పద్ధతులు అవలంబించాలని టీచర్లకు సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ‘‘74 శాతం మంది విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లో పాఠాలను చదవలేకపోతున్నారని తెలిసి ఆశ్చర్యపోయా’’ అని పేర్కొన్నారు. పాఠశాలల ఆవల మరో రకమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ‘‘కులమతాల పేరుతో కొట్టుకుంటున్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీటికి అతీతంగా విద్యార్థులను తయారు చేయాలి. అలా చేస్తే విద్యార్థులు స్కూళ్లను వీడి బయటకు వెళ్లాక ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉంటారు’’ అని మనీష్ వివరించారు. మనం మంచి వైద్యులను, ఇంజినీర్లను తయారుచేస్తున్నామని, కానీ మంచి మనుషులను మాత్రం తయారుచేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.