: తెలంగాణలో కొత్త జిల్లాల రూపు మారేనా?... నేడు కలెక్టర్లతో కేసీఆర్ కీలక భేటీ!
ప్రస్తుతం 10 జిల్లాలతో ఉన్న కొత్త రాష్ట్రం తెలంగాణ... దసరా తర్వాత 27 జిల్లాలతో కూడిన నవ తెలంగాణగా మారనుంది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాలతో పాటు ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల రూపురేఖలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్ ను కేసీఆర్ సర్కారు విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మరోవైపు విపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు కొత్త జిల్లాల డ్రాఫ్ట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దాదాపుగా కలిసి ఉన్న వరంగల్, హన్మకొండలను వేర్వేరు జిల్లాలుగా విభజించిన డ్రాఫ్ట్ పై సొంత పార్టీ నుంచి కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డ్రాఫ్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందా? అన్న కోణంలో తెలంగాణ సర్కారు పునరాలోచన చేస్తోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆయా జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనం ప్రతిస్పందన, ఆందోళనలు, మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు తదితరాలపై కేసీఆర్ సమీక్షించనున్నారు.