: నేను అంతటి గొప్పవాడిని కాదు... భావి తరాలు తెలుసుకోవాల్సింది గొప్పవాళ్ల గురించే!: రోశయ్య
విశ్రాంతి సమయంలో పుస్తకం రాయాలనే ఆలోచన తనకు లేదని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జీవిత చరిత్రను పుస్తకంగా తెచ్చే ఆలోచన లేదని అన్నారు. తానేమీ దేశం కోసం త్యాగం చేయలేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది జీవితాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, అలాంటి వారి గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి త్యాగాలతో పోల్చుకుంటే తానేమీ చేయలేదని ఆయన తెలిపారు. 18 ఏళ్లకే క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వల్ల మంచి అవకాశాలు దక్కాయని, దీంతో తాను వివిధ అవకాశాలు దక్కించుకున్నానని, అలా దక్కిన ప్రతి అవకాశానికి న్యాయం చేసే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. వారసులను తయారు చేయాలన్న ఆలోచన ఏనాడూ రాలేదని, అలా ఒక వారసుడిని జుట్టు పట్టుకుని పైకి తీసుకొచ్చి, 'నా వారసుడు' అంటూ పరిచయం చేయాలన్న కోరిక అస్సలు లేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన అన్నింటితోనూ ఆనందంగా ఉన్నానని, ఇకపై ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు.