: జీఎస్టీ ఓ సాహసమే!... మోదీ నిర్ణయానికి ఒబామా ప్రశంసలు!
సుదీర్ఘ కాలంగా బిల్లుగానే ఉండిపోయిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఎట్టకేలకు చట్టంగా మారబోతోంది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లుకు మెజారిటీ రాష్ట్రాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి చట్టరూపం ఇవ్వనున్నారు. కేవలం భారత్ కు మాత్రమే పరిమితమైన ఈ కీలక నిర్ణయానికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ప్రస్తుతం జీ20 సమావేశాల్లో భాగంగా చైనాలో ఉన్న ఒబామా... నిన్న మోదీని కలిసిన సందర్భంగా జీఎస్టీని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో... పన్నుల సంస్కరణల విషయంలో ధైర్యంగా ముందుకెళ్లారని ఆయన మోదీని ప్రశంసించారు. జీఎస్టీ రూపంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కూడా మోదీని ఒబామా కొనియాడారు.