: పవన్ కల్యాణ్ కాకినాడ సభకు సర్వం సిద్ధం... 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'గా నామకరణం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. నేరుగా ప్రజల్లోకి వచ్చి పోరాడుతానని చెప్పిన సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బీజేపీ ఎక్కడైతే 'ఒకే ఓటు రెండు రాష్ట్రాలు' అని తీర్మానం చేసిందో... అక్కడి నుంచే తన ప్రత్యేకహోదా పోరాటం మొదలవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఈనెల 9న కాకినాడలో జనసేన తొలి బహిరంగ సభ ఏర్పాటు కానుందని చెప్పారు. ఈ సభకు ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ అని ఆయన నామకరణం చేసినట్టు తెలిపారు. కాకినాడలోని జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభను నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దీంతో ఏపీలో మరోసారి ప్రత్యేకహోదా సాధనపై అందరి చూపు నిలవనుంది.