: పెళ్లైన వారానికే కేసు...పీడీ యాక్టు కింద అరెస్టు
హైదరాబాదులో గత నెల 22న జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో వరుడు ఇర్ఫాన్ పెళ్లవుతుందన్న ఆనందంలో రెండు తుపాకులతో 10 రౌండ్లను గాల్లోకి కాల్చాడు. అయితే ఈ కాల్పులపై వివాదం రేగగా, అలాంటిదేమీ లేదని, పుకార్లను నమ్మవద్దని డీసీపీ సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కాల్పుల వీడియో మీడియాలో దర్శనమివ్వడంతో షాక్ అయిన డీసీపీ సత్యనారాయణ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించి, ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన ఘటన పూర్వాపరాలు పరిశీలించి, ఆ రెండు తుపాకులు డమ్మీ తుపాకులు అని నిర్ధారించారు. ఈ తుపాకులు సినీ నిర్మాత అలీకి చెందినవని గుర్తించారు. దీంతో ఇర్ఫాన్ పై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.