: కాల్పులు జరిపిన పెళ్లికొడుకును పట్టేసిన హైదరాబాద్ పోలీసులు
పాత బస్తీలోని షామ థియేటర్ ముందు పెళ్లి బారాత్ జరుగుతుంటే, గుర్రంపై కూర్చుని రెండు చేతులతో రెండు పిస్టల్స్ పట్టుకుని దాదాపు 10 రౌండ్లు కాల్పులు జరిపిన కొత్త పెళ్లికొడుకును పోలీసులు గుర్తించారు. ఆగస్టు 22న ఈ ఘటన జరుగగా, కాల్పులు జరగలేదని చెబుతూ వచ్చిన సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, అటువంటి వదంతులను నమ్మవద్దని ప్రత్యేక ప్రకటన కూడా వెలువరించారు. ఇక ఈ ఉదయం నుంచి కాల్పులు జరిగిన దృశ్యాలు వివిధ టీవీ చానళ్లలో పదేపదే టెలికాస్ట్ అవుతుండగా, ఫలక్ నుమా ఏసీపీ ఆధ్వర్యంలోని నాలుగు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టి, సీసీటీవీల ఫుటేజ్ లను పరిశీలించి బరాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి సాగిందో తెలుసుకున్నారు. ఆపై మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నుంచి వరుడి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని పూర్తి వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.