: బాధ్యత లేని జగన్ తో మాకెందుకు?: కాల్వ
విపక్ష నేతగా కనీస బాధ్యతతో కూడా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా రాయలసీమలో ఎండుతున్న పంటలను కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే, దాన్ని కూడా జగన్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. గతంలో ఎన్నడైనా ఇంత ఎత్తున పంటలను కాపాడిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క రోజు కూడా రైతులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రెయిన్ గన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామని, కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం వాటిని అధిగమించి ముందుకు సాగుతుందని వెల్లడించారు. రెయిన్ గన్స్ వాడటంలో నిర్దిష్ట ప్రణాళికల ప్రకారమే సాగుతామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఒకేసారి అందరికీ రెయిన్ గన్స్ సదుపాయంతో నీరివ్వడం సాధ్యం కాదని, దశలవారీగా తాము రైతులకు సహకరిస్తుంటే, విపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సబబని ఆయన అడిగారు.