: చంద్రబాబు నిజాయతీపరుడని అనుకున్నా... ఆయన మంచి అవకాశాన్ని వదులుకున్నారు!: పురంధేశ్వరి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయతీపరుడని తాను భావించానని, ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటపడతాడని అనుకుంటే, అందరికీ అనుమానం కలిగేలా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని బీజేపీ మహిళా మోర్చా నేత దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అనుమానం మరింతగా బలపడిందని, ఓ మంచి అవకాశాన్ని ఆయన వదిలేసుకున్నాడని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారన్న విషయాన్ని వివరిస్తే, మరిన్ని నిధులను ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, రాష్ట్రానికి నిధులు రావడం లేదని, కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 1,050 కోట్లు ఇచ్చామని, దానికి లెక్క చెప్పలేదని గుర్తు చేశారు.