: 'క్రైమ్ పెట్రోల్', 'సావ్ధాన్ ఇండియా' సీరియళ్లతో ప్రేరణ పొంది, తల్లి సాయంతో తండ్రిని చంపిన బాలుడు
క్రైమ్ సీరియళ్లు చూసి వాటి ప్రభావంతో ఓ బాలుడు తన తల్లి సాయంతో కన్నతండ్రినే హతమార్చిన ఘటన బీహార్లోని పూర్ణియా జిల్లాలో చోటుచేసుకుంది. ఉపేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు నిందితులని 24 గంటలలోనే పట్టుకున్నారు. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... 14 ఏళ్ల బాలుడయిన ఉపేంద్ర కుమారుడు హత్యచేయడానికి ముందు క్రైమ్ పెట్రోల్, సావ్ధాన్ ఇండియా వంటి క్రైమ్ సీరియళ్లను వీక్షించాడని చెప్పారు. వస్త్రతయారీ ఫ్యాక్టరీ నడిపిస్తోన్న తన తండ్రిని చంపితే వ్యాపారం, ఆస్తి తనకు వస్తాయని భావించి తన తల్లి సాయంతో ఇనుప రాడ్తో కొట్టి ఉపేంద్రను చంపేశాడు. అనంతరం అక్కడ సాక్ష్యాలు లేకుండా చేసేందుకు తల్లి చూసింది. ఎట్టకేలకు పోలీసులు నిందితులయిన తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు.