: 12 అంశాలపై వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకున్న మోదీ.. రేపు డ్రాగన్ కంట్రీలో పర్యటించనున్న ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా నేడు కూడా వియత్నాంలో పర్యటించారు. భారతదేశ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రధాన మంత్రి ఎన్గుయెన్ జువాన్‌తో పాటు ఆ దేశ ప్రభుత్వ నేతలతో భేటీ అయి ఆ దేశానికి భారత్ చేసే సాయంపై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ దేశానికి 500 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఇరు దేశాలు నడుచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశమే భారత్, వియత్నాం దేశాల భవిష్యత్తు సహకారానికి మంచి మార్గాన్ని నిర్దేశిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళపై సహకరించుకోవాల్సిన ఆవశ్యకతను రెండు దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం రష్యా, చైనాలకు మాత్రమే ఉన్నాయని మోదీ అన్నారు. ఇప్పుడు భారత్ కూడా ఆ లిస్టులో చేరిందని, తన వియత్నాం పర్యటన మంచి ఫలితాన్నిచ్చిందని తెలిపారు. వియత్నాం మరింతగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. వియత్నాం ప్రజలు సాధికారత సాధించాలని, పరిపుష్టం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పధ్ధతులు పాటించాలని ఆయన అన్నారు. వియత్నాంతో భాగస్వాములయ్యేందుకు 125 కోట్ల భారతీయులు సిద్ధమేనని పేర్కొన్నారు. మోదీ వియత్నాం పర్యటనతో మొత్తం 12 అంశాలపై ఆ దేశంతో ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, అంతరిక్షం, ద్వంద్వ పన్నులు, నౌకాయానానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం, తీరప్రాంతంలో గస్తీ పడవల నిర్మాణం వంటి కీలక ఒప్పందాలను వియత్నాంతో భారత్ చేసుకుంది. వియత్నాంలో పర్యటన తరువాత రేపు, ఎల్లుండి మోదీ చైనాలో పర్యటిస్తారు. చైనాలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఉగ్రవాదం అంశాలపై నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. అనంతరం ఐదవ తేదీన చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అయి, లావోస్ బయలుదేరుతారు. ఆ దేశంలో భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.