: ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురిచేస్తోంది: టీపీసీసీ నేత జానారెడ్డి
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగడం లేదని టీపీసీసీ నేత జానారెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ నేతలు తెలంగాణ ప్రజల తరఫున సర్కారుని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటును అశాస్త్రీయంగా చేస్తున్నారని, వసతులు, చారిత్రక నేపథ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాల విభజన జరగాలని ఆయన అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, రిజర్వేషన్ల అమలు అంటూ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని జానారెడ్డి విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆయన అన్నారు. తాము ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.