: కొత్తగా కనిపెట్టిన మెరూన్, గోల్డ్ కలర్ చేపకు 'ఒబామా' పేరు
నాలుగేళ్ల క్రితం టెనెస్సీ నదిలో కనుగొన్న ఒక చేపకు శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు 'ఒబామా' పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కనుగొన్న మరో చేపకు కూడా ఆయన పేరే పెట్టారు. మెరూన్, గోల్డ్ రంగుల్లో ఉన్న కొత్త చేపను శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్నారు. దానికి ఒబామా పేరు పెట్టి.. హవాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మెరైన్ శాంక్చురీని ఏర్పాటు చేసిన ఒబామాకు కృతజ్ఞతగా ఆ చేపకు ఆయన పేరే పెట్టినట్లు తెలిపారు. తాము కొత్తగా కనుగొన్న మెరూన్, గోల్డ్ రంగుల్లో ఉన్న చేప సముద్రంలో 300 అడుగుల లోతులో నివసిస్తుందని చెప్పారు. దీన్ని మూడు నెలల క్రితం కనుగొన్నట్లు పేర్కొన్నారు. సముద్రంలో ఆ లోతులో కోరల్ రీఫ్స్, ఇతర సముద్రప్రాణులు ఎక్కువగా నివసిస్తాయని, ఎటువంటి చేపలు నివసించని ఆ ప్రాంతంలో తాజాగా తాము కనుగొన్న చేప కనిపించడం విశేషమని చెప్పారు. ఒబామా ప్రచార లోగోలో ఉన్న రంగులతో ఈ చేప రంగులు పోలి ఉన్నాయని అన్నారు.