: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ లు యుద్ధ నేరస్తులే!... ఐరాస హెచ్చార్సీలో బలూచ్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు స్వదేశంలోనే పెను సమస్యలు ఎదురవుతున్నాయి. స్వాతంత్ర్యం కోసం నినదిస్తున్న బలూచిస్థాన్ నుంచి ఎదురవుతున్న ఈ సమస్యలు నవాజ్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇప్పటికే బలూచ్ లో భారత్ అనుకూల నినాదాలు మారుమోగుతుండగా... విశ్వశాంతి కోసం ఏర్పాటైన ఐక్యరాజ్యసమితిలోనూ బలూచ్ గళం విప్పింది. ఐరాస మానవహక్కుల మండలిలో బలూచ్ ప్రతినిధిగా ఉన్న మెహ్రాన్ మారి... నవాజ్ షరీఫ్ తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ రాహీల్ షరీఫ్, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లను యుద్ధ నేరస్తులుగా అభివర్ణించారు. బలూచిస్థాన్ తో పాటు సింధ్ ప్రాంతంలోనూ పాక్ సర్కారు యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. వీటిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించి షరీఫ్, రాహిల్, ఐఎస్ఐ చీఫ్ లను యుద్ధ నేరస్తులుగా పరిగణించి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.