: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సమయానుగుణంగా స్పందిస్తా: వెంకయ్యనాయుడు
ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాను సమయానుగుణంగా స్పందిస్తానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో చెన్నైలో రెండో రోజు జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరంగ యాత్ర వీడియోను విడుదల చేశారు. తొలుత తెలుగు మీడియా సంపాదకులతో వెంకయ్యనాయుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన సాయం అందించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేస్తున్నారని, దాని ప్రయోజనం ఏపాటిదో తెలుసుకోవాలంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. ఏపీకి సంపూర్ణ సాయమందించాలన్న తపన తనకు కూడా ఉందని, అందుకు తగ్గట్టుగా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలు, మసీదులు.. ఇలా ఎటువంటి నిర్మాణాలున్నా వాటిని పడగొట్టాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చెప్పారు.