: ఎన్ని లేఖలైనా రాసుకోనీ, నిజం మారదుగా: పాక్ వైఖరిపై భారత్
జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న ఆందోళనలకు భారత్ కారణమంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితికి లేఖ రాయడాన్ని భారత్ తప్పుబట్టింది. "వారిని ఎన్ని లేఖలైనా రాసుకోనీయండి. క్షేత్ర స్థాయిలో నిజం మారదు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్థాన్ చట్ట విరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకుందన్న నిజం ప్రపంచమంతటికీ తెలుసునని ఆయన అన్నారు. వివిధ అంతర్జాతీయ సదస్సుల్లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టాలని భావిస్తూ, 22 మంది పార్లమెంట్ సభ్యులను ప్రత్యేక బృందంగా ఎంపిక చేయడాన్నీ ఆయన ఆక్షేపించారు. అంతర్జాతీయ సదస్సులకు బదులు సీమాంతర ఉగ్రవాదంపై చర్చించేందుకు ప్రతినిధులను ఢిల్లీకి పంపితే బాగుంటుందని ఆయన అన్నారు. ఎంతమందిని పంపి ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, పాక్ కేంద్రంగా వేళ్లూనుకున్న ఉగ్రవాదం గురించి ప్రతి దేశానికీ తెలుసునని వికాస్ స్వరూప్ అన్నారు. కాగా, గడచిన నెల రోజుల వ్యవధిలో నవాజ్ షరీఫ్ రెండు సార్లు ఐరాస కార్యదర్శి బాన్ కీ మూన్ కు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.