: బీజేపీ ‘ఒక ఓటు...రెండు రాష్ట్రాలు’ అన్న చోటే పవన్ కల్యాణ్ మలిసభ!... కాకినాడ సభకు అనుమతులొచ్చేశాయి!
ఏపీకి ప్రత్యేక హోదాపై చాలా ఆలస్యంగా గళం విప్పిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... తన తొలి గళాన్ని ఇటీవలే తిరుపతిలో వినిపించారు. తన మలి సభను తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తిరుపతి వేదిక మీదే ప్రకటించారు. రాష్ట్రంలోని ఈ చివర ఉన్న తిరుపతిలో తొలి సభ... ఆ చివరలో ఉన్న కాకినాడలో మలి సభకు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణం వుంది. గతంలో కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ‘ఒక ఓటు... రెండు రాష్ట్రాలు’ అన్న నినాదాన్ని వినిపించింది. ఈ క్రమంలో రాష్ట్ర విభజనలో కీలక భూమిక పోషించిన బీజేపీ... అందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిన ప్రదేశంలోనే తన రెండో సభను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న జరగనున్న ఈ సభకు కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ గ్రౌండ్ వేదిక కానుంది. ఈ మేరకు జనసేన చేసిన దరఖాస్తుకు అటు పోలీసులతో పాటు ఇటు వర్సిటీ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిన్న కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు అనుమతిచ్చిన పోలీసులు, వర్సిటీ అధికారులకు పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ కృతజ్ఞతలు తెలిపారు.