: 'ఏసీబీ'కే మస్కా కొట్టేసిన అవినీతి తిమింగలం!... బినామీ చేత డబ్బు డ్రా చేయించిన విజయసాగర్ బాబు!
ఏపీ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న విజయసాగర్ బాబు... దేవుడి ముందే లంచావతారం ఎత్తారు. శ్రీశైలం దేవస్థానం ఈఓగా పనిచేసిన విజయసాగర్ బాబు... ఇటీవల డిప్యూటీ కమిషనర్ గా కొత్త బాధ్యతల్లో చేరారు. ఈయన అవినీతి దందాపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిన్న విజయవాడలోని ఆయన ఇంటిపై దాడులు చేసింది. ఈ సందర్భంగా దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులను ఆయన పోగేసినట్లు ఏసీబీ గుర్తించింది. దాడుల్లో భాగంగా నున్న ఆంధ్రా బ్యాంకు శాఖలోని ఆయన లాకర్ ను తెరచిన ఏసీబీ... అందులో రూ.50 లక్షల విలువ చేసే కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తాన్ని ఆయన శ్రీశైలం ఈఓగా ఉన్న సమయంలో పోగేసినట్లు తేలింది. సదరు నోట్ల కట్టలపై శ్రీశైలంలోని టెంపుల్ బ్రాంచ్ ముద్ర ఉండటంతో ఏసీబీ ఈ భావనకు వచ్చింది. ఇక లాకర్ లో మరో అరకిలో బంగారాన్ని కూడా ఏసీబీ సీజ్ చేసింది. ఇదిలా ఉంటే... ఏసీబీ దాడులను పసిగట్టిన విజయసాగర్ బాబు అధికారులకు మస్కా కొట్టారు. తన బినామీ మన్నె శ్రీనివాసరావును రంగంలోకి దించిన ఆయన... శ్రీశైలం బెంపుల్ బ్రాంచ్ లో తాను దాచుకున్న నగదును విత్ డ్రా చేయించారు. విజయసాగర్ బాబు ఆదేశాలతో వేగంగా స్పందించిన మన్నె శ్రీనివాసరావు... సదరు బ్రాంచిలోని నగదును నిన్ననే విత్ డ్రా చేసుకుని పరారయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన ఏసీబీ మన్నె శ్రీనివాసరావు కోసం గాలింపు చర్యలు చేపట్టింది.