: బంగ్లా బౌలింగ్ కోచ్ గా వెటరన్ బౌలర్ వాల్ష్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ గా వెటరన్ స్పీడ్ స్టర్, వెస్టిండీస్ మాజీ దిగ్గజ బౌలర్ కోర్ట్నీవాల్ష్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ జట్టుకు మూడేళ్ల పాటు బౌలింగ్ కోచ్ గా సేవలందించేందుకు బోర్డుతో ఒప్పందం చేసుకోనున్నాడు. ఈ మేరకు ట్వీట్టర్ ద్వారా ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభ గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నాడు. బంగ్లా ప్రధాన కోచ్ చండికా హతురసింగతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపాడు. ప్రపంచంలోనే అరివీర భయకర బౌలింగ్ త్రయంగా పేరొందిన విండీస్ బౌలర్లు మాల్కం మార్షల్, కోర్ట్నీ వాల్ష్, కర్ట్ లీ ఆంబ్రోస్ లలో వాల్ష్ ప్రధానమైన వ్యక్తి. ప్రపంచంలో 500 వికెట్లు తీసుకున్న తొలి టెస్టు ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తి కోర్ట్నీ వాల్ష్ కావడం విశేషం. 1984 నుంచి 2001 వరకు వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ లో సేవలందించిన వాల్ష్ టెస్టుల్లో మొత్తం 519 వికెట్లు తీసుకున్నాడు.