: 55 ఏళ్ల నిరీక్షణకు తెర... క్యూబా చేరిన అమెరికా ప్యాసింజర్ విమానం


అమెరికా, క్యూబా దేశాల 55 ఏళ్ల నిరీక్షణకు నేడు తెరపడింది. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుధ్ధకాలం నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విమానాల సర్వీసు కూడా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో చోరవతో ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. దీంతో ఒబామా క్యూబాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో నేడు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాండర్‌ డేల్ నగరం నుంచి క్యూబాలోని సాంటాకార్లాకు ‘జెట్‌బ్లూ ఫ్లయిట్-387’ ప్యాసింజర్ విమానం 51 నిమిషాల్లో చేరుకుని చరిత్ర నెలకొల్పింది. దీంతో 55 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అమెరికా విమానాశ్రయంలో నీటి ఫిరంగులతో విమానానికి వీడ్కోలు పలకగా, క్యూబా విమానాశ్రయంలో కూడా నీటి ఫిరంగులతో స్వాగతం పలికారు. ఈ వీడ్కోలు, స్వాగత కార్యక్రమంలో విమానాశ్రయం అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఇరు దేశాల జెండాలు పట్టుకొని పాల్గొన్నారు. విమానంలో వచ్చిన అమెరికా రవాణా శాఖ మంత్రి ఆంథోని ఫాక్స్, జెట్‌ బ్లూ ఫ్లైట్ కంపెనీ సీఈవో రాబిన్ హేస్ తదితరులకు అధికారులు సాంటాక్లారా నగరం పెయింటింగ్స్‌ ను బహూకరించారు. ఈ సందర్భంగా రాబిన్ హేస్ మాట్లాడుతూ, అమెరికాలోని పది నగరాల నుంచి క్యూబా చేరుకోవచ్చని ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని అమెరికా ఎయిర్‌ లైన్స్ సంస్థలు క్యూబాకు కమర్షియల్ విమానాలు నడపనున్నాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News