: సల్మాన్ తన గొప్పతనం నిరూపించుకున్నారు: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
రియో ఒలింపిక్స్ కు భారత్ తరఫున సుహృద్భావ రాయబారిగా వ్యవహరించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రోటోకాల్ పాటించి తన గొప్పతనం నిరూపించుకున్నారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తెలిపింది. ఢిల్లీలో ఈ మేరకు ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మాట్లాడుతూ, ఒలింపిక్స్ లో భారత్ తరఫున పాల్గొన్న అథ్లెట్లకు నగదు బహుమతి అందిస్తానని చెప్పిన సల్మాన్ ఖాన్ తన హామీని నెరవేర్చుకునేందుకు అథ్లెట్ల వివరాలు అందించాలని కోరారన్నారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారని రాజీవ్ మెహతా చెప్పారు. అందులో తనను రాయబారిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారని ఆయన తెలిపారు. అథ్లెట్ల వివరాలు పంపిస్తే వారికి 1.01 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేస్తానని చెప్పారని రాజీవ్ మెహతా పేర్కొన్నారు. పెద్ద సెలెబ్రిటీ అయినప్పటికీ ఆయన ప్రొటోకాల్ పాటిస్తున్నారని, ఐఓఏ ద్వారా అథ్లెట్లకు నగదును అందించాలని కోరుకుంటున్నారని, సల్మాన్ ను సుహృద్భావ రాయబారిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.