: రాజమహల్ ప్రధానం ద్వారం మూసివేతపై రాజకుటుంబీకుల నిరసన
రాజస్థాన్ జయపురలోని సువిశాలమైన రాజమహల్ ప్యాలస్ విషయంలో అధికారుల చర్యలను నిరసిస్తూ రాజకుటుంబీకులు రోడ్డెక్కారు. రాజమహల్ ప్యాలెస్ ప్రధాన ద్వారాన్ని ప్రభుత్వం సీల్ చేయడాన్ని నిరసిస్తూ రాజమాత పద్మినీ దేవీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. వందల మంది మద్దతుదారులతో కలిసి జయపుర వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాగా, రాజమహల్ లో కొంత భాగాన్ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో ప్రధాన ద్వారం కూడా ఉందని, 1993లో ఇందుకు చట్టబద్ధత కూడా లభించిందని ప్రభుత్వ వాదన. అయితే ఈ వాదనను సవాల్ చేస్తూ 2002లో రాజకుటుంబీకులు కేసు వేశారు. తాజాగా, రాజమహల్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పద్మినీ దేవి, ఆమె కుమారుడు పద్మనాబ్ సింగ్ సహా పలువురు రాజకుటుంబీకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, పద్మినీ దేవి కుమార్తె దియా కుమారి బీజేపీ ఎమ్మెల్యే. రాజస్థాన్ సీఎం వసుంధర రాజెకు ఆమె సన్నిహితురాలు కూడా. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడమే కాకుండా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.