: ఏపీలో టీచర్స్ డే మారింది... 7న నిర్వహిస్తున్నాం!: గంటా
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించుకునే టీచర్స్ డే ఆంధ్రప్రదేశ్ లో మారింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న నిర్వహించాల్సిన గురుపూజోత్సవ వేడుకలను ఏడో తేదీన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వినాయక చవితి, ఉపాధ్యాయుల దినోత్సవం ఒకేరోజున రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. అందరి కోరిక మేరకు గురుపూజోత్సవాన్ని వాయిదా వేశామని ఆయన చెప్పారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ లో ప్రభుత్వం తరపున ఏడో తేదీన గురుపూజోత్సవం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దీంతో ఏపీలో టీచర్స్ డే సెప్టెంబర్ 7న అధికారికంగా జరగనుంది.