: నయా దోపిడీ... 'కాంబో ప్యాకేజ్'తో మాత్రమే 'జనతా గ్యారేజ్'!
తమ అభిమాన నటుడి కొత్త చిత్రాన్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అభిమానులను థియేటర్ల యాజమాన్యాలు సరికొత్త మార్గంలో దోచుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' టికెట్ల కోసం వెళుతున్న వారికి ఓ కూల్ డ్రింక్, పాప్ కార్న్ కొనుగోలు తప్పనిసరి చేస్తూ, కనీసం రూ. 130 తో కొనుగోలు చేయాలని, అలా చేస్తేనే టికెట్లు ఇస్తామని బుకింగ్ కౌంటర్లలో స్పష్టం చేస్తూ, నయా దోపిడీ మొదలు పెట్టి అధికారిక 'బ్లాక్' దందాను మొదలు పెట్టాయి. రకరకాల తినుబండారాలను కాంబో ప్యాక్ పేరుతో ప్రదర్శిస్తూ అధిక ధరలను గుంజుతున్నారు. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను తీసుకునేందుకు కౌంటర్ల వద్దకు వెళ్లిన వారికి కూడా కాంబో ప్యాక్ ధర చెల్లిస్తే మాత్రమే టికెట్లిస్తామని కరాఖండీగా చెబుతున్నారు. ఈ దందా విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రధాన థియేటర్లలో కొనసాగుతోంది. థియేటర్ యాజమాన్యాల అడ్డగోలు దోపిడీపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.