: ఇక వెలగపూడి నుంచే ఏపీ పాలన!... నేడు తాత్కాలిక సచివాలయంలో తొలి కేబినెట్ సబ్ కమిటి భేటీ!
ఏపీ పాలన ఇక నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచే కొనసాగనుంది. వెలగపూడిలో యుద్ధ ప్రాతిపకదిన సిద్ధమైన తాత్కాలిక సచివాలయంలోకి ఏపీ ప్రభుత్వ శాఖలన్నీ దాదాపుగా చేరిపోయిన దరిమిలా... అక్కడ నేడు ఓ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు అక్కడ ఏర్పాటైన తమ కార్యాలయాల్లోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండగా... నేడు తొలి కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. ఆరుగురు మంత్రులు పాల్గొంటున్న ఈ సబ్ కమిటీ భేటీకి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న మీడియాతో మాట్లాడిన యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై అన్ని రకాల సమీక్షలు వెలగపూడి నుంచే జరగనున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి- పాలన సంస్కరణలపై జగరనున్న ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, మృణాళిని పాల్గొంటారు. ఇక రేపు, ఎల్లుండి కూడా కేబినెట్ సబ్ కమిటీలకు చెందిన పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. వెరసి ఏపీ పాలనకు సంబంధించిన కీలక సమావేశాలన్నీ ఇకపై వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం కేంద్రంగానే జరగనున్నాయి.