: అందంగా ఉండడమే శాపమైంది.. భర్త సూటిపోటి మాటలకు ముఖం కాల్చుకుంది!
అవును.. అందంగా ఉండడమే ఆమెకు శాపమైంది. ఆమె అందం తన జీవితానికి ఎక్కడ ఎసరు పెడుతుందోనని భావించిన భర్త ఆమెను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. సూటిపోటి మాటలతో హింసించేవాడు. అతడి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు అంద వికారంగా మారాలని నిర్ణయించుకుంది. తన ముఖాన్ని కాల్చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌కు చెందిన రేఖా లోధీ(30), నిర్మల్ కుమార్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. రేఖ చాలా అందంగా ఉంటుంది. అంతకంటే అందిరితో కలివిడిగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లతో కలిసిపోయి మాట్లాడుతుంది. రేఖను చూసినవారెవరైనా కళ్లు తిప్పుకోలేరంటే అతిశయోక్తి కాదు. దీంతో స్వతహాగానే అందరి కళ్లు ఆమెపై ఉండేవి. అందం ఆమెకు స్నేహితులను తెచ్చిపెట్టింది. అయితే భార్య అందం భర్త నిర్మల్‌ను ఇబ్బంది పెట్టసాగింది. ఆమెకు ‘ఫాలోయింగ్’ ఎక్కువ అవుతుండడంతో తట్టుకోలేకపోయాడు. పెళ్లయిన రెండేళ్ల నుంచే అందం విషయంలో ఆమెను టార్చర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె అందం అందరినీ ఆకర్షిస్తోందని గొడవకు దిగేవాడు. అతడి స్నేహితులు, బంధువుల నుంచి ఇది మరింత ఎక్కువ అవుతుందని వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండంతో రేఖ తట్టుకోలేకపోయింది. ఇందుకు కారణమైన అందాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుంది. తన నుంచి అందరూ దూరంగా జరగాలంటే అందవికారంగా మారడమే సరైన పరిష్కారం అనుకుంది. బుధవారం ముఖాన్ని అంటించేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 20-25 శాతం గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. భర్త, మామ వేధింపులతోనే తాను ఈ పనికి పాల్పడినట్టు ఆస్పత్రిలో రేఖ తెలిపింది. అయితే వారిపై కేసులు పెట్టేందుకు నిరాకరించింది. రేఖ తల్లిదండ్రులు మాత్రం తమకు న్యాయం జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారిద్దరిపై చర్యల కోసం డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం రేఖ నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఆమె ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.