: మీరు ఫ్యాషన్‌ను ఫాలో అవుతారా..? అయితే ఈ చిక్కులు తప్పవు!


ఫ్యాషన్.. ఒకప్పుడు మహిళలకు మాత్రమే పరిమితమయ్యేది. అందానికి మెరుగులు దిద్దుతూ గంటలు కొద్దీ అద్దం ముందు నిలబడే మహిళలు నేటికీ ఉన్నారు. ఈ విషయంలో చాలా జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే మారుతున్న కాలంతోపాటు పురుషుల అభిరుచుల్లోనూ బోల్డన్ని మార్పులు వచ్చాయి. వారు కూడా అందానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే అందానికి మెరుగులద్దే క్రమంలో యువతీయువకులు కొన్ని కొత్త సమస్యలను వారికి తెలియకుండానే కొనితెచ్చుకుంటున్నారు. అందం కోసం పాటించే చిట్కాలు అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. అందం మాటున పొంచి వుండే సమస్యలేంటో తెలుసుకుందామా.. అమ్మాయిలు ధరించే హైహీల్స్ చాలా ప్రమాదంతో కూడుకున్నవి. వీటిని ధరించడం వల్ల మడమలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎత్తును పెంచుకునేందుకు, తమ హుందాను చాటుకునేందుకు మహిళలు వీటిని ధరిస్తుంటారు. అయితే ఇవి తొడుక్కోవడం వల్ల శరీరం ముందర భాగంపై విపరీతమైన బరువు పడుతుంది. దీంతో కాలి మడమలు దెబ్బతింటాయి. కొందరు తమలోని దృష్టి లోపం ఇతరులకు తెలియకూడదనే ఉద్దేశంతో కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగిస్తుంటారు. వైద్యులను సంప్రదించకుండా సొంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఇబ్బందులు పాలయ్యే ప్రమాదం ఉంది. అమర్చుకునే ప్రయత్నంలో ఏమాత్రం పొరపాటు జరిగినా శాశ్వత అంధత్వం వస్తుంది. ఇక కొందరు తమ వయసును దాచిపెట్టుకునేందుకు జుట్టుకు రంగేస్తుంటారు. ముఖానికి దట్టంగా మేకప్ వేస్తుంటారు. వీటివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వాటిల్లో వాడే రసాయనాలు శరీరానికి మేలు కంటే హానే చేస్తాయి. మెడకు టై లేకుండా వస్తే అనుమతించని ఆఫీసులు చాలానే ఉన్నాయి. టైతో హుందాగా కనిపించినా దానిమాటున నష్టం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టైని మెడకి బిగుతుగా కట్టుకోవడం వల్ల మెదడు, కళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా మున్ముందు అది గ్లకోమాకు దారితీసే ప్రమాదం ఉంది. మనకు హాని కలిగించే వాటిలో జీన్స్ ఒకటి. జీన్స్ ధరించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మన్నిక, అందం కారణంగా చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే టైట్ జీన్స్ ధరించడం వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయట. టైట్ జీన్స్‌ప్యాంట్ ధరించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. వృషణాలు కుచించుకుపోయి మగాళ్లలో శృంగారపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అలాగే చర్మసంబంధ వ్యాధులు వస్తాయి. సో.. అందంగా ఉండేందుకు ప్రయత్నించడం మంచిదే కానీ ఆ మాటున తలెత్తే సమస్యలపైనా దృష్టిసారిస్తే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News