: ఐరాసలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మార్గముంది... కానీ చాలా క్లిష్టం: జాన్ కెర్రీ
ఐక్యరాజ్యసమితిలో భారత్ కోరుకుంటున్న శాశ్వత సభ్యత్వాన్ని పొందేందుకు మార్గముందని, కానీ అది చాలా సంక్లిష్టమైనదని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అభిప్రాయపడ్డారు. భారత్ శాశ్వత సభ్యత్వ కోరిక సమంజసమేనని, తాము దాన్ని సమర్థిస్తామని అన్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఐఐటీ విద్యార్థులతో సమావేశమైన ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలు చెప్పారు. పాకిస్థాన్ సైతం ఉగ్రవాదంతో ఇబ్బందులు పడిందని, ఇప్పటికైనా మారి, ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపేందుకు ఆ దేశం కదలాలని అన్నారు. పాక్ సరైన దిశగా అడుగులు వేయడం లేదని ప్రపంచం నమ్ముతోందని, ఆ భావన పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని అన్నారు. టెర్రర్ క్యాంపులన్నింటినీ నాశనం చేయాలని సూచించారు. ఇండియాలో నియంత్రణా విధానం మరింతగా మెరుగుపడాల్సి వుందని, ప్రభుత్వాల పాలన ప్రజా జీవనాన్ని మరింత ప్రభావితం చేయాల్సి వుందని అన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుని, అవాంతరాలను అధిగమిస్తూ లక్ష్యం దిశగా సాగిపోయే ఇండియాకు తమ దేశం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని పేర్కొన్నారు. తదుపరి అధ్యక్ష ఎన్నికలను గురించి ఓ విద్యార్థి ప్రశ్నించగా, అమెరికా ప్రజలు మంచి న్యాయనిర్ణేతలని, సమర్థులనే ఎన్నుకుంటారని తెలిపారు.